నాకు తెలిసిన చలం
సెప్టెంబరు 11, 2008
గొప్పగా అలోచించే వాళ్ళలో ఓ రకమైన విశ్రుంఖలత్వం వుంటుంది. వీళ్ళు ముఖ్యంగా మన సనాతన ధర్మాలని ప్రశ్నిస్తారు. కానీ వీళ్ళ వాక్పటిమ ఎంతగా వుంటుందంటే, వీళ్ళు మన ఆచారాలను ప్రశ్నించినా అందులో ఏదో నిజం ఉందనుకుంటాం. ఇలాంటివాళ్ళు వితండవాదం చేసినా అది అభ్యుదయ భావాలుగల వాళ్ళకు నచ్చుతుంది. కానీ వీళ్ళని సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తారు, సరైన కారణం లేకపోయినా, ఎందుకంటే వీళ్ళ తర్కానికి వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఈ అభ్యుదయ భావాలు గల వాళ్ళు (వీళ్ళలో ఓ వర్గమే ఈ హేతువాదులు) ఇలాంటి వాళ్ళకోసమే ఎదురు చూస్తుంటారు. వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని ఆలోచించరు.
ఇలాంటి విశ్రుంఖలత్వం ఉన్నవాళ్ళలో చలం ఒకరని నాకు అనిపించింది. నేను సుజాత అనే ఒక కథ చదివాను (చలం వ్రాసింది). సుజాత భర్త గొప్ప స్వాతంత్ర్యవాది(ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన కథ). సుజాత భర్త ఆమెని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఐనా ఆమె ఓ పోలీస్ తో అక్రమసంబంధం పెట్టుకుంటుంది. భర్తకి జబ్బు చేస్తుంది. అప్పుడు ఆమెకి భర్త మీడ జాలి కలుగుతుంది. భర్తకి సేవ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పోలీస్ దగ్గరికి వెళ్ళడం మాత్రం మానదు. చివరగా తన తప్పు తెలుసుకుంటుంది (తెలుసుకున్నట్టు అనిపిస్తుంది), ఎలా అంటే నా భర్తని ఈ స్థితిలో వుండగా నీతో రాలేను అంటుంది. మళ్ళీ పోలీస్ మీదే మనసు ఉంటుంది ఆమెకు. ఇది మామూలుగా ఎవరైనా చెబితే ఈమె శీలం లేనిది అనే భావన కలుగుతుంది. కాని ఈ కథను చలం మలచిన తీరు చూస్తే మనకు వేరే అభిప్రాయం కలుగుతుంది. అరె ఈమె భర్తకోసం ఎంత త్యాగం చేసింది అని అనుకుంటాం చివరకి. ఇది చలం నైపుణ్యము.
చలం ఆదర్శవాదులకు నచ్చుతాడు. ఎందుకంటే వీళ్ళు సామాజిక కట్టుబాట్లగురించి ఆలోచించరు. కేవలం ఆ వ్యక్తి కోణం నుంచి ఆలోచిస్తారు. ఈమెకి కోరిక కలిగింది కాబట్టి అతనితో వెళ్ళింది అని అనుకుంటారు. ఇక్కడ శీలం అన్న పదానికి విలువ లేదు. మనకు నచ్చింది మనం చేస్తాం అనే పద్దతిలో ఉంటారు. కాని కాస్త వాస్తవికతతో ఆలోచించే సాంప్రదాయవాదులు (వీళ్ళు, ఈమె తప్పుచేసింది అనే కోణంలో ఆలోచిస్తారు ) చలాన్ని వ్యతిరేకిస్తారు. ఈ గొప్పోళ్ళంతా ఏదో సమాజం పాడైపోయింది, మనమే దీన్ని ఉద్దరించాలి అని ఉన్న సాంప్రదాయాలకి భిన్నంగా రాస్తారు. ఇలాంటివారు కొన్ని సామాజిక కట్టుబాట్లు సహేతుకంగా లేకపొయినా, వీటిపట్ల వీళ్ళు మరీ అతిగా స్పందిస్తారు, పర్యవసానాలగురించి అలోచించకుండా.
Entry Filed under: నా అభిప్రాయాలు. .
15 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed



1.
కె.మహేష్ కుమార్ | సెప్టెంబరు 11, 2008 at 1:47 అపరాహ్నం
చలాన్ని “అర్థం చేసుకోవాలనుకునే” మీ సాహసానికి నా అభినందనలు. నా మేధకు చలం అర్థంకాడు, అందుకే నేను కేవలం అనుభవించడానికి ప్రయత్నిస్తాను.
2.
శశాంక | సెప్టెంబరు 11, 2008 at 5:57 అపరాహ్నం
చలంని అర్ధం చేసుకోవడానికి నా వయసు అనుభవం రెండూ చాలవులెండి. ఏదో ఈ కథ చదివిన వేడిలో నాకు తోచింది రాశా అంతే
3.
నిషిగంధ | సెప్టెంబరు 11, 2008 at 7:48 అపరాహ్నం
అసలు చలం డిక్షనరీ లో శీలం అనే పదం/పదార్ధం లేదనిపిస్తుంది.. మనసెటు వెళ్తే మనల్నీ అటే వెళ్ళమంటాడు! ఎవర్నైనా ‘తనది ‘ అనే చట్రంలో బిగించకుండా ప్రేమించమటాడు.. ఆయన కధల్లోని నాయికలను అలానే చూపించాడు కానీ సుఖాంతం అయిన కధలు బహు తక్కువ!!
4.
KRISHNA RAO JALLIPALLI | సెప్టెంబరు 11, 2008 at 8:19 అపరాహ్నం
మీ భావాలను మీరు వెలిబుచ్చారు. తప్పు లేదు. కాని.. మరిన్ని చలం పుస్తకాలు చదవండి.
చలం చెప్పేదేమిటి అంటీ (my own interpretetion)… తప్పు చేయడానికి మగ వాడికి ఎంత స్వేచ్ఛా, అధికారం, అవకాశం ఉందొ.. అవన్నీ ఆడవారికి కూడా ఉండాలంటారు. మగవాడు వ్యభిచారం చేస్తీ లేని తప్పు… ఆడవారు చేస్తీ తప్పెందుకు అవుతుంది. శీలం అనేది ఆడవారికి మాత్రమె ఉండాలా. . మగాడికి ఉండక్కరలేదా?? వాడికేమి… వాడు మగాడు.. ఏమి చేసినా చెల్లుతుంది అనేవారిని చెప్పు తీసుకొని కొట్టాలి. మగవారికి ఒక రూలు, ఆడవారికి ఒక రూలు ఉండకూడదు. అందరు సమానమే.. even in commiting sins … ఇది చలం చెప్పేది. చదవండి… రాస్తూ ఉండండి.
5.
durgeswara | సెప్టెంబరు 11, 2008 at 8:23 అపరాహ్నం
చలం గారి చివరిదస రచనలు చదవండి .అరుణాచలం నుంచి మిత్రులకు వ్రాసిన ఉత్తరాలు చదవండి. అనుభం జీవిత సత్యాన్ని ఎలాబోధిస్తుందో మనిషికి ,అర్ధమవుతుంది. చలమెకాదు, ఇలా పూర్వజన్మ వాసనలలో విస్రుంఖలతకు అలవాటుపడి. ఈ జన్మలో మనుషులుగా జన్మించిన వారి మానసిక పరిస్తితి మొదటి దశలో ఇలాగే వుంటుంది.
6.
అబ్రకదబ్ర | సెప్టెంబరు 12, 2008 at 2:25 పూర్వాహ్నం
నాకు ఇరవయ్యేళ్లప్పుడనుకుంటా, చలంగారి ‘మైదానం’ చదివా. చెత్తలా అనిపించింది. అసలదంత హిట్టవుతుందని ఆయననుకున్నాడో లేదో! బూతుల్లేని బూతు కధ. దానికంత పేరెందుకో అర్ధం కాలేదు. ఈ పుస్తకానికి జేజేలు కొట్టేవాళ్లెవరూ అందులో ఉన్నవాటిని ఆచరణలో పెట్టేవాళ్లు కారన్నది నిజం.
ఎవరైనా తప్పు చేస్తుంటే దిద్దాలి కానీ, ‘నువ్వు తప్పు చేసినప్పుడు లేనిది నేను చేస్తే వచ్చిందా’ అనేది వితండవాదం, విచ్చలవిడితనం. చలం రచనల్లో ఉండేది ఇదే అయితే ఇదేం స్త్రీవాదం?
7.
శ్రవణ్ | సెప్టెంబరు 12, 2008 at 11:18 పూర్వాహ్నం
నేను చలం “మైదానం” మాత్రమే చదివాను. నాకైతే అందులో చలం “స్త్రీ హృదయాన్ని” తెలుసుకోవాలనే ప్రయత్నమే కనిపిస్తుంది. ఒక స్త్రీ మనస్సులోని సంఘర్షణ తెలుస్తుంది. (క్యారెక్టరైజేషన్, సిచువేషన్‌ల వల్ల ) విచ్చలవిడితన్నాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపించలేదు, పైగా మనం పుస్తకం చదివేటప్పుడు ఒకరకమైన ట్రాన్స్‌లో వుంటాం.
ఇకపోతే అది హిట్ అవ్వడానికి స్త్రీని నాలుగ్గోడలమధ్య బంధిచే రోజుల్లో వచ్చింది కాబట్టే. సినిమా హిట్టుకీ రిలీజ్‌కి సంబంధమున్నట్టే ఈరోజుల్లో వస్తే ఆపుస్తకానికి పెద్ద విలువ వుండేదికాదేమో (content వొకటే అయినా).
8.
Saraswathi Kumar | సెప్టెంబరు 12, 2008 at 11:31 పూర్వాహ్నం
చావుకి ముడిపెడితేగానీ లంఖణానికి ఒప్పుకోరన్న చందంగా జడసమాజంలో ఒకింత స్పందన కోసం చలం తన భావాలలో కొంత తీవ్రతను ప్రదర్శించాడు. దానిని అలానే అర్థం చేసుకోవాలి గానీ as it is గా తీసుకోకూడదు. చలం లేవనెత్తిన అంశాలు తిరుగులేనివి. చలం సారాంశాన్ని, చలం అసలు ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటే కొంత పరిణితి ఉండాలి. ఒక్క రచనతో చలం అర్థం కాడు. మీకు చలం గురించి ఆసక్తి ఉంటే ప్రస్తుతం మార్కెట్లో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు రచించిన ‘సత్యాన్వేషి చలం’ అనే పుస్తకం దొరుకుతున్నది. అది చదవండి.(ఈ పుస్తక పరిచయం నా బ్లాగులో ఉంది)
9.
కె.మహేష్ కుమార్ | సెప్టెంబరు 12, 2008 at 2:24 అపరాహ్నం
@అబ్రకదబ్ర: చలాన్ని అర్థం చేసుకోలేక అనుభవించడానికి ప్రయత్నించినవాడిగా ఒక మాట. చలానిది “అభిప్రాయ సాహిత్యం” కాదు “అనుభవసాహిత్యం”. సమాజానికి తనేదో నేర్పాలనో, ఉద్దరించాలనో, తను చేసేది సరైనదే అని నమ్మాడుకాబట్టి అందరు అలా చెయ్యాలనో లేక అలా చెయ్యలేనివారు చేతకానివారనో ఎప్పుడూ ఇధ్బోధించడానికి ప్రయత్నించలేదు.
’మైదానం’ కూడా తన అన్ని కథలూ నవలల్లాగానే రాసుంటాడు. హిట్టా..ఫట్టా అనే విషయాన్ని తను జీవితంలో ఎప్పుడూ పట్టించుకున్న ధాఖలాలు లేవు. కాబట్టి ఈ నవల అందుకు మినహాయింపుకాదు. తను అనుకున్నది అనుభవించింది రాశాడు. దానికి విలువల్ని ఆపాదించి నెత్తినకట్టుకున్నా, అన్యాయమని నేలకేసికొట్టినా తనకొచ్చిన తేడా పెద్దగా ఏమీ లేదు.
ఇక మైదానం నచ్చకపోవడం మీ వ్యక్తిగత అభిరుచి కాబట్టి అందులో ఎటువంటి ఆక్షేపణలూ చెయ్యజాలను. నా జీవితంలో కొంత వేదాంతాన్ని, అలౌకిక ఉనికిని సృష్టించిన పుస్తకాలలో బుచ్చిబాబు ‘చివరకుమిగిలేది’ తరువాత దీనికే స్థానం.
10.
కొత్తపాళీ | సెప్టెంబరు 12, 2008 at 8:20 అపరాహ్నం
నాయనలారా .. సుమారు నూరు పుస్తకాలు రాసిన చలాన్ని,ఒక సమాజపు ఆలోచనా ధోరణి మీద శతాబ్దానికి పైగా బలమైన ముద్ర వేసిన చలాన్ని, ఒక్క కథో నవలికో చదివి “చలం ఇట్టాంటివాడు” అని అంచనా వెయ్య ప్రయత్నిస్తున్నారే! ఎంత వెర్రితనమో అర్ధమవుతోందా?
11.
KRISHNA RAO JALLIPALLI | సెప్టెంబరు 12, 2008 at 9:00 అపరాహ్నం
చలాన్ని .. అర్థం చేసుకొన్నవారికి – అర్థం చేసుకోన్నంత. అభిరుచులు పలు రకాలు. మనిషి మనిషి కి మారుతుంటాయి మరి. కాలానికి కాలానికి కూడా మారుతూ ఉంటాయి. ఆ మాట కొస్తే.. ఇప్పుడు SP బాలు గారి పాటలు అంటే నాకు ఇష్టం ఉండవు.. అలాగే యండమూరి రచనలు అన్నా.
12.
bollojubaba | సెప్టెంబరు 12, 2008 at 9:47 అపరాహ్నం
కొత్తపాళీ గారు
సువర్ణాక్షరాల వంటి మాటలు చెప్పారు. నిజమే.
చలం పై దుమారం లేచినప్పుడల్లా చలానికే మేలు జరుగుతా ఉంటాది. (అతన్ని గురించి మరింత మంది ఆలోచిస్తారు, మరింతమంది చదువుతారు, మరింతమంది రెండు వర్గాలుగా విడిపోయి భావాలతో కొట్టుకుంటావుంటారు). బహుసా బతికుంటే చిరునవ్వు నవ్వుకుంటా ఉండే వాడేమో.
చలం ఒక రేడియో ఇంటర్వూలో అంటాడు – నా సాహిత్యం అంతా నేను చేసిన అంత:బహిర్ యుద్దమే- అని.
తెలుగు సాహిత్యంలో చలం పాత్ర విస్మరింపరానిది. అతని భావాలను మైనస్ చేసి (ఎందుకంటే భావాలు చాలా సందర్భాలలో కాలదోషం పడుతూ ఉంటాయి. ఏ షేక్స్పియర్వో తప్ప)
అతని రచనలను చదివితే కలిగే మజా ఆ కాలం నాటి ఏ రచయితా (ఇంకా తెగించి చెప్పాలంటే ఆ తరువాత కాలంలో కూడా) ఇవ్వలేదనేది ఒక సత్యం (కనీసం నామట్టుకు).
బొల్లోజు బాబా
13.
శశాంక | సెప్టెంబరు 12, 2008 at 3:24 అపరాహ్నం
@నిషిగంధ గారు: ఈ కథలో నాకదే అనిపించింది
@KRISHNA RAO గారు, durgeswara గారు: చలం ఇతర రచనలు చదివితే నా అభిప్రాయం మారుతుందేమో. చలం చివరిదశలో రమణ మహర్షిని కలిశారని తరువాత అయన రచనలలో కొంత మార్పు వచ్చిందని విన్నాను.
@అబ్రకదబ్ర గారు: మీ ఆవేశం నాకర్ధమైంది
@శ్రవణ్ గారు: మైదానం పుస్తకం గురించి నేనూ చాలా విన్నాను. బహుశా అప్పటి సామాజిక పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని మనం ఈ పుస్తకాన్ని చదవాలేమో
@Saraswathi Kumar గారు: చలం గురించి అన్వేషణ చేయాల్సిందేనండి
14.
శశాంక | సెప్టెంబరు 19, 2008 at 11:41 పూర్వాహ్నం
@కొత్తపాళీ గారు, @బొల్లోజు బాబా గారు అంతేనంటారా…
15.
Suneeth Kumar | అక్టోబర్ 11, 2008 at 9:05 అపరాహ్నం
Anadariki Namaskaram!
‘Sahithya vimarsha’ anedi enthati vyakthigatha spandano, ‘Sahithyam’ kooda anthe ani naa abhiprayam. Kaani kondaru annatlu avi samajagatham ayinapudu daaniki kontha badhyatha kooda avasaramenemoo.
Chadavatam modalu pettina kshaname ee rachanani a-to, e-to, eto oka vaipu JUDGE chesi pareyyali anna dorani lo pothe, ika migiledi Vyakthiigatha aropanale, anduloni vishayalani nijanga ACCEPT chesi, anubhavinchagalithe nijamaina ‘Sahithya vimarsha’ jaruguthundi.
Chalam rachanalani nijanga chadavalante, manam manala kaakunda chalamlaagane chadavali. Ade mansutho chadavali, ade mantatho chadavaali. Athani anni rachanallo kanipinche modati amsham kevalam ‘visrukhalatha’, ade ayana kathalakannitiki aarambham, ade oopiri – kaani ade sarvaswam kaadu.
Vistrukaathaku venaka vunna vastavala thaaluku jigupsa. Adi bhariche sthairyam vunnavadike athani rachanalu.
Eee godavalantha endukane ayyane oo sari chanipoye mundu naa kathalu ika evaru chadavakandi annadata!
Seriously… ika mee istam !!!