వర్డుప్రెస్సు నుండి బ్లాగరుకి పయనం

ముందుగా ఓ మాట… నా బ్లాగు వర్డుప్రెస్సు నుండి ఇక్కడికి ( http://sashanka.blogspot.com ) మారింది.

నేను వర్డుప్రెస్సు నుండి  బ్లాగరుకి ఎందుకు మారుతున్నానంటే:

1. బ్లాగరు గూగులోడి సర్వీసు.
2. మిగతా గూగుల్ సర్వీసులనుండి బ్లాగరుకి మంచి సదుపాయాలు ఉన్నాయి.
3. వర్డుప్రెస్సు లో టెంప్లేట్ ని మనకి నచ్చిన విధంగా మార్చాలంటే డబ్బులు చెల్లించాలి. బ్లాగరు పూర్తిగా  ఉచితం.
4. బ్లాగరు లో ఐతే బోలెడు ప్రయోగాలు చేయవచ్చు.
5. ఈమధ్య వర్డుప్రెస్సోళ్ళు బ్లాగుల్లో యాడ్ లు కూడా పెడతామంటున్నారు.

కానీ ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. బుద్ధిగా ఏ ప్రయోగాలు చేయకుండా బ్లాగు రాసుకొనేవాళ్ళకు వర్డుప్రెస్సే ఉత్తమం

ఇక నా వర్డుప్రెస్స్ బ్లాగులోని టపాలను బ్లాగరులోకి మార్చడానికి (Comments ని కూడా Export చేయడానికి) చాలా పరిశోధనలు చేయవలసివచ్చింది. గూగులోడిని తగలెయ్య, ‘వర్డుప్రెస్సు నుండి బ్లాగరుకు’ మారడం ఎలా అని సెర్చ్ చేస్తే సెర్చ్ రిసల్ట్ లో అన్ని లింకులు ‘బ్లాగరు నుండి వర్డుప్రెస్సుకి’ మారడం మీదే వచ్చాయి. అప్పుడు అర్ధమైంది నాకు ఎక్కువమంది బ్లాగరు నుండి వర్డుప్రెస్సుకి మారతారని. చివరకి కొన్ని లింకులు దొరికాయి (blogsyn0.3, blog2blog, blogSyncV1.1, wxr2blogger).  ఏ Installation అవసరం లేకుండా online లో టపాలు Export చేయాలంటే  blogSyncV1.1 ని ఉపయోగించవచ్చు.  blogsyn0.3 లో Comments కూడా Export  చెయ్యొచ్చన్నాడు కానీ Comments Export కాలేదు. బహుశా Google Blogger Data API మారడం వల్లనేమో.

ఇంతాచేసి  చివరికి Comments ని మాత్రం Export చేయలేకపోయాను 😦 .

అక్టోబర్ 2, 2008 at 4:17 సా. వ్యాఖ్యానించండి

ఆంధ్రావాళ్ళకు అక్కర్లేదా ఆత్మగౌరవం

నిన్న నల్గొండలో లగడపాటి రాజగోపాల్ కారు ఓ తెలంగాణా కార్యకర్తని గుద్దిందంట. ఆయన కారు ఆపకుండా వెళ్ళిపోయాడంట (ఆపకుండా వెళ్ళడాన్ని నేను ఖండిస్తున్నాను, ఆయన పైన చట్టపరంగా చర్య తీసుకోవాలి ). దీనికి తెలంగాణా కార్యకర్తలు నానా రబస చేసారు, ఏదో తెలంగాణా సమస్యలాగా. ఈ సంఘటనకి తెలంగాణా సమస్యకి ఏమైనా సంబంధం ఉందా అసలు. సరే ఈ రాజకీయ నాయకులు అంతే, బోడిగుండుకి మోకాలికి లంకె వేస్తారు అని అనుకుందాం.

నేను హైదరాబాద్ లో ఓ హాస్టల్ లో ఉన్నప్పుడు (మూడు సంవత్సరాల క్రితం ) మా ప్రక్క రూం లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన పట్టభద్రుడు ఒకడు ఉన్నాడు. ఒకానొక మాటల సందర్భం లో, ఆ మీ కోస్తావాళ్ళంతా మా (వ్యవసాయ)భూముల్ని చాలా చీప్ గా కొంటున్నారు అని అన్నాడు. మరి మీరెందుకు అమ్ముతున్నారు అని నేనన్నాను. లేదూ మీ ఆంధ్రావాళ్ళంతా మా హైదరాబాద్ కి వచ్చి దందా చేస్తున్నారు అని అన్నాడు. అదేంటండీ మేమేమైనా పాకిస్తాన్ వాళ్ళమా మాకు హైదరాబాద్ లో ఉండే హక్కు లేదా. మరోసారి, నేను కాచిగూడా నుండి అమీర్ పేట్ కి ఓ ఆటోలో వెళుతున్నా. ఆ ఆటోవాడితో ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నా. వాడూ సరదాగా ఏదో చెబుతూనే ఉన్నాడు. మీ ఏరియా ఏంటన్నా అని అడిగాడు. నేను ఏలూరు నుండి వచ్చా అని చెప్పా. ఏలూరు ఎక్కడన్నా అని అన్నాడు. కోస్తాలే అని చెప్పా. అంతే ఆటో దిగేవరకు నాతో మాట్లాడ్డం మానేసాడు. మా మిత్రుడొకడు నల్గొండలో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ ఇంటి ఓనరుకి ఓ అబ్బాయి ఉన్నాడు. ఒకసారి, మీ ఆంధ్రా వాళ్ళ వల్ల నాకు ఉద్యోగం రావడం లేదు అని అన్నాడంట. ఇంతకీ అతను చదివింది ఏంటంటే ఇంటర్మీడియట్.

మరి ఈ ముగ్గురికీ ఆంధ్రా వాళ్ళు ద్రోహం చేస్తున్నారా !!. మీరు మరీనూ… ఎవరో ముగ్గురు మూర్ఖంగా మాట్లాడినంతమాత్రాన తెలంగాణావాళ్ళు ఆంధ్రా వాళ్ళని అగౌరవ పరచినట్టా అని అంటారా. మరి ఇలాంటివారు తెలంగాణాలో ఎంతమంది ఉన్నారు. సరే అన్నాది ఎవరో మూర్ఖులు అని ఆత్మగౌరవం లేకుండా బతికేద్దామా. నిజం గా తెలంగాణా వెనకబాటుతనానికి ఆంధ్రావాళ్ళే కారణామా. మరింకేమీ కారణాలు లేవా. మరి ఆంధ్రావాళ్ళే తెలంగాణా వెనకబాటుతనానికి కారణమైతే మరి ఆంధ్రా ప్రాంతాలైన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు ఎందుకు వెనకబడి వున్నాయి. మీరంతా మనం అన్నదమ్ముల్లాగా గౌరవంగా విడిపోదామంటున్నారు. మేము విడిపోతేనే గౌరవంగా బతుకుతాం అని నేనంటున్నా. మాకూ అత్మ గౌరవం ఉంది.

సెప్టెంబర్ 26, 2008 at 9:58 ఉద. 11 వ్యాఖ్యలు

వైరస్ లను నిరోధించే సులువైన మార్గం

ఈమధ్య ఎక్కువ శాతం వైరస్ లు పెన్ డ్రైవ్ ల ద్వారానే వస్తున్నాయి. సిస్టం లో ఆటోరన్ ని నిలిపివేయుటద్వారా ఇలా వచ్చేవాటిని నిరోధించవచ్చు. దీనికోసం ‘Group policy’ లో ఈ క్రింద చూపినట్టు కొన్ని మార్పులు చేయాలి.

Go to Start > RUN command > in RUN command give   gpedit.msc  >  press OK

ఇప్పుడు ‘Group policy’ విండో ఓపెన్ అవుతుంది. ఈ క్రింద చూపినట్టు ‘User Configuration’ ని మార్చాలి.

ఇలా CD ల నుండి ఆటోరన్ ద్వారా వ్యాపించే వైరస్ లను కూడా ఆపవచ్చు. కానీ ఇలా ఆటోరన్ ని నిలిపివేయడం వలన CD లు ఆటోమాటిక్ గా ఓపెన్ కావు.  ఏదైనా మృదులాంతరాన్ని (software) ఆటోమాటిక్ గా స్థాపించాలంటే (install చేయాలంటే) CD  డ్రైవ్ మీద ‘Right click’ చేసి  ‘Auto play’ ని క్లిక్ చేస్తే సరిపోతుంది.

చాలామంది కాపీ చేసే తొందరలో ఫోల్డర్ పేరుని మార్చరు. “New folder” పేరుతోనే ఫోల్డర్ ఉండిపోతుంది. దీనిని ఆసరాగా తీసుకుని ఈమధ్య “New folder.exe” అనే వైరస్ బాగా వ్యాపిస్తున్నది. వైరస్ “New folder” పేరుతో కాపీ అవుతుంది. మనకు తెలియక మనం కాపీ చేసిన ఫోల్డరే కదా అని క్లిక్ చేస్తాం. అంతే సంగతులు !!. సాధ్యమైనంతవరకు ఫోల్డర్స్ కి అర్ధవంతమైన పేర్లు ఇవ్వడం మంచిది. దీనివల్ల మనకు తెలియని పేరుతో ఏదైనా వైరస్ కాపీ ఐనా ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ వైరస్ ‘Hidden’ గా ఉంటే ఎలాగూ ఆటోరన్ నిలిపివేయబడింది కాబట్టి దానితో మనకి ప్రమాదం లేదు.

సెప్టెంబర్ 12, 2008 at 11:10 ఉద. 7 వ్యాఖ్యలు

నాకు తెలిసిన చలం

గొప్పగా అలోచించే వాళ్ళలో ఓ రకమైన విశ్రుంఖలత్వం వుంటుంది. వీళ్ళు ముఖ్యంగా మన సనాతన ధర్మాలని ప్రశ్నిస్తారు. కానీ వీళ్ళ వాక్పటిమ ఎంతగా వుంటుందంటే, వీళ్ళు మన ఆచారాలను ప్రశ్నించినా అందులో ఏదో నిజం ఉందనుకుంటాం. ఇలాంటివాళ్ళు వితండవాదం చేసినా అది అభ్యుదయ భావాలుగల వాళ్ళకు నచ్చుతుంది. కానీ వీళ్ళని సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తారు, సరైన కారణం లేకపోయినా, ఎందుకంటే వీళ్ళ తర్కానికి వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఈ అభ్యుదయ భావాలు గల వాళ్ళు (వీళ్ళలో ఓ వర్గమే ఈ హేతువాదులు) ఇలాంటి వాళ్ళకోసమే ఎదురు చూస్తుంటారు. వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని ఆలోచించరు.

ఇలాంటి విశ్రుంఖలత్వం ఉన్నవాళ్ళలో చలం ఒకరని నాకు అనిపించింది. నేను సుజాత అనే ఒక కథ చదివాను (చలం వ్రాసింది). సుజాత భర్త గొప్ప స్వాతంత్ర్యవాది(ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన కథ). సుజాత భర్త ఆమెని చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఐనా ఆమె ఓ పోలీస్ తో అక్రమసంబంధం పెట్టుకుంటుంది. భర్తకి జబ్బు చేస్తుంది. అప్పుడు ఆమెకి భర్త మీడ జాలి కలుగుతుంది. భర్తకి సేవ చేస్తూ ఉంటుంది. కానీ ఈ పోలీస్ దగ్గరికి వెళ్ళడం మాత్రం మానదు. చివరగా తన తప్పు తెలుసుకుంటుంది (తెలుసుకున్నట్టు అనిపిస్తుంది), ఎలా అంటే నా భర్తని ఈ స్థితిలో వుండగా నీతో రాలేను అంటుంది. మళ్ళీ పోలీస్ మీదే మనసు ఉంటుంది ఆమెకు. ఇది మామూలుగా ఎవరైనా చెబితే ఈమె శీలం లేనిది అనే భావన కలుగుతుంది. కాని ఈ కథను చలం మలచిన తీరు చూస్తే మనకు వేరే అభిప్రాయం కలుగుతుంది. అరె ఈమె భర్తకోసం ఎంత త్యాగం చేసింది అని అనుకుంటాం చివరకి. ఇది చలం నైపుణ్యము.

చలం ఆదర్శవాదులకు నచ్చుతాడు. ఎందుకంటే వీళ్ళు సామాజిక కట్టుబాట్లగురించి ఆలోచించరు. కేవలం ఆ వ్యక్తి కోణం నుంచి ఆలోచిస్తారు. ఈమెకి కోరిక కలిగింది కాబట్టి అతనితో వెళ్ళింది అని అనుకుంటారు. ఇక్కడ శీలం అన్న పదానికి విలువ లేదు. మనకు నచ్చింది మనం చేస్తాం అనే పద్దతిలో ఉంటారు. కాని కాస్త వాస్తవికతతో ఆలోచించే సాంప్రదాయవాదులు (వీళ్ళు, ఈమె తప్పుచేసింది అనే కోణంలో ఆలోచిస్తారు ) చలాన్ని వ్యతిరేకిస్తారు. ఈ గొప్పోళ్ళంతా ఏదో సమాజం పాడైపోయింది, మనమే దీన్ని ఉద్దరించాలి అని ఉన్న సాంప్రదాయాలకి భిన్నంగా రాస్తారు. ఇలాంటివారు కొన్ని సామాజిక కట్టుబాట్లు సహేతుకంగా లేకపొయినా, వీటిపట్ల వీళ్ళు మరీ అతిగా స్పందిస్తారు, పర్యవసానాలగురించి అలోచించకుండా.

సెప్టెంబర్ 11, 2008 at 12:14 సా. 19 వ్యాఖ్యలు

నా దేశం ఎందుకిలా ఉంది…

ఇది రామాయణ కాలం నాటి సంగతి. వనవాసానికి బయలుదేరిన రాముడి వెంట పురజనం కూడా చాలాదూరం వస్తారు. ఊరి చివరకు వెళ్ళిన తరువాత రాముడు వెనక్కి తిరిగి, “అమ్మలారా అయ్యలారా” నాకోసం మీరు చాలాదూరం వచ్చారు, ఇక తిరిగి మీఇళ్ళకు వెళ్ళండి అని అంటాడు.

అలా చెప్పగా చాలామంది వెనక్కి వెళ్ళిపొగా కొంతమంది మాత్రం అక్కడే నిలబడి ఉంటారు (వీళ్ళు హిజ్రాలు) . రాముడు మీరు వెళ్ళలేదేమిటి అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఇలా సమాధానమిస్తారు, మీరు ఇందాక “అయ్యలారా అమ్మలారా” అని అన్నారు, మరి మా సంగతి ఏమిటి అని అంటారు. వాళ్ళ భక్తికి మెచ్చిన రాముడు వాళ్ళకి ఓ వరమిస్తాడు. 1947 తరువాత మీరు భారతదేశాన్ని ఏలతారు అని…..!!!

(ప్రముఖ నవలా రచయిత కుష్వంత్ సింగ్ గారి ఢిల్లీ అనే పుస్తకంలోనిది)

సెప్టెంబర్ 10, 2008 at 2:56 సా. 7 వ్యాఖ్యలు

ఏదీ శాశ్వతం కాదు

అనగనగా రాజ్యం, రాజ్యానికి రాజు. రోజు రాజుగారిదగ్గిరికి మునీశ్వరుడు వస్తాడు. ముని రాజుగారికి తాయిత్తు ఇచ్చి, అందులో మంత్రం ఉందని కష్ట కాలంలో దానిని చూడమని చెబుతాడు. కొంతకాలానికి ఆ రాజు వేటకు వెళతాడు. ఆ విషయం తెలుసుకున్న శత్రుదేశపు సైన్యం అడవిలో ఉన్న రాజు మీద దాడి చేస్తారు.  రాజుగారు తెలివిగా గుబురుగా ఉన్న ఓ చెట్టెక్కి దాక్కుంటాడు. రాజుగారికి మునీశ్వరుడు ఇచ్చిన తాయిత్తు గుర్తుకువస్తుంది. దానిని విప్పి చూడగా అందులో ఇలా వ్రాసి ఉంటుంది, “ఏదీ శాశ్వతం కాదు, ఇది కూడా జరిగిపోతుంది”. రాజుగారికి విషయం అర్దమౌతుంది,  ధైర్యంగా అలాగే ఉంటాడు.

ఈలోగా వేటకు వచ్చిన సైనికుల్లో ఒకడు ఎలాగొలా తప్పించుకుని రాజ్యానికి చేరుకుంటాడు.  విషయం తెలుసుకున్న సైనికులు అడవికి వెళ్ళి శత్రుసైనికులను చీల్చి చెండాడుతారు.  ఆవిధంగా రాజుగారు కష్టాలనుండి గట్టెక్కుతాడు.

ఈ పై రెండు మాటల్లోనే నాకు ఎంతో వేదాంతం వుందనిపించింది

సెప్టెంబర్ 10, 2008 at 2:29 సా. వ్యాఖ్యానించండి